ఆర్యులు అను మానవ జాతి వారు ప్రాచీన కాలములో మన భారత దేశములో సంచరించిన లేక నివసించిన ప్రదేశమును ఆర్యావర్తము (Aryavarta) అని మనము భావిస్తాము. అపుడు ఆర్యులు అను జాతి వారు ఒకరు భారత దేశములో ప్రాచీన కాలంలో నిజంగానే నివసించారు అని భావించాల్సిన అవసరం వస్తుంది. కాని వేదములలో గాని, వేదాంగములలో గాని, పురాణములలో గాని, ఇతిహాసములలో గాని ఎక్కడా కుడా ఆర్యులనే జాతిని గురించిన ప్రసక్తి మనకు కనబడదు. అలాగే మన హిందూ గ్రంధములలో ఎక్కడా కుడా ఆర్యులనే జాతి వారు ఒకరు ఉండేవారని గాని, వారి రూపు రేఖలు ఈ విధంగా ఉంటాయని గాని ఎక్కాడా చెప్పలేదు. హిందూ గ్రంధములలో వివిధ జాతుల ప్రస్తావన ఉంది గాని ఆర్య జాతి ప్రస్తావన లేదు. అలాగే ఫలానా జాతి ఫలానా రూపు రేఖలతో ఉంటారని చెబుతూ మనుషుల భౌతిక వర్ణన ఎక్కడా లేదు. ఆర్య అను పదమును ఒక గృహస్థుని, ఒక సదాచారుని సూచించే విధముగా వాడారు. అంతే గాని ఒక జాతిని సూచించే విధంగా ఎక్కడ కుడా వాడలేదు. మరి ఆర్యులు అనే వారు లేనప్పుడు ఆర్యావర్తము అనే పద ప్రయోగము ఎలా వచ్చింది? దానికి కారణము ఏమిటి? ఆ విషయాలు ఈ వ్యాసములో మనము చూద్దాము.
ఆర్యులు
ఇప్పుడు మన వేదములలో ఆర్య పదమును ఏ విధంగా వాడారు, ఎవరిని సూచించారో చూద్దాము,
వషట్ తే పూషన్నశ్మిన్త్పూతావర్యమాహో తా కృణోతు వేధాః
సిస్రతామ్ నార్వృ త ప్రజాతా వి పర్వాణి జీహతామ్సూతవా ఉ
(46వ శ్లోకం, సూక్తం 11, కాండ 1, అథర్వణ వేదము)
అర్ధము: గర్భిణికి సూత సిజేరియన్ చికిత్స నిర్వహిస్తుంది. అర్యముడు హోత సహాయముతో పూషా దేవికి హవిస్షులు సమర్పించుకుంటున్నాడు. ఈమెకు ఆరోగ్యవంతమైన శిశువును ప్రసాదించుము.
అస్మే ఇన్ద్రో వరుణో మిత్రో అర్యమాద్యుమ్నం యఛ్చంతు మహి శర్మ సప్రథఃనో
అవధ్రం జ్యోతిరదితేర్తా వృధో దేవస్య శ్లోకం సవితుర్మనామహే
(ఋగ్వేదం – సుదాసు యుద్ధములు)
అర్ధము: యుద్ధములు విజయవంతముగా ముగియడంతో అందరు అనగా ఇంద్రుడు, వరుణుడు, అర్యముడు వారి వారి నడుములకు బిగించిన లంగోటా కట్లను వదులు చేసుకున్నారు. అందరు ఆనందముగా తమకు విజయము ప్రసాదించిన సవితా దేవికి కృతజ్ఞతలు తెలపడానికి హోమము నిర్వహించారు.
ఇక్కడ మొదట చూసిన అథర్వణ వేదము లోని శ్లోకము వలన మనకు ఆర్యమ అంటే ఒక గృహస్థుడు అని అర్థమవుతుంది. ఋగ్వేదములోని పై రెండవ శ్లోకము అర్యముడు ఇతర యుద్ధ వీరులైన వరుణుడు, ఇంద్రుడులతో కలిసి శత్రువ్లులపై యుద్ధము చేసినట్లు తెలుస్తుంది. ఆర్యులనే వారెవరూ ఆకాశమునుండి ఊడిపడి ఇండియాలో కుర్చుని వేదములు వ్రాసినట్లయితే అర్యముని, వరుణుని, ఇంద్రుని వేదములలో వేరు వేరుగా ప్రస్తుతించరు కదా!
ఈ ఆర్యజాతి వాదమును బహుళ ప్రాచుర్యములోనికి తీసుకుని వచ్చిన మాక్స్ ముల్లర్ ఆర్య పదమును జాతి పరముగా వాడడము తప్పేనని ఒప్పుకున్నాడు. ఆర్య పదమును భాషాపరముగా మాత్రము వాడాలి అన్నాడు. ఆయన 1900 లో చనిపోయాడు. తరువాత 1947 లో మార్టిం వ్హీలర్ ఆర్యులు ఇండియాలోని హరప్పా వాసులపై దండెత్తి సింధు లోయ నాగరికతను నాశనం చేశారని ఒక వాదనను ప్రతిపాదించాడు. తరువాత 1960 లో తన వాదనలు తప్పని ఒప్పుకున్నాడు. అయినాగాని ప్రపంచ వ్యాప్తంగా ఆర్య జాతి వాదము ఇప్పటికి చలామణిలోనే ఉంది. ఈ ఆర్యజాతి వివాదము నిజమని నమ్మి ఇండియాలోని సమాజము కుల జాతి ప్రాంతీయ పరంగా విభాజితమయి కూర్చొని ఉంది.
అలాగే వేదములలో ఎన్నో అంశాలు వివరంగా ఉంటాయి. ఏ శ్లోకము ఏ ఋషి వ్రాశాడు, ఏ సూక్తము ఏ ఋషి వ్రాశారు అనేది ఎంతో వివరంగా ఉంటుంది. ఉదాహరణకు బ్రహ్మ, అంగీరసుడు, విశ్వామిత్రుడు, భృగు, వశిష్టుడు, గౌతముడు ఇలా వివిధ శాఖలకు సంబంధించిన ఋషులలో ఏ శ్లోకము ఎవరు వ్రాశారు వాటి ఛందస్సు ఏమిటి అన్నీ వివరంగా ఉంటాయి. ఎక్కడా కూడా ఆర్యులు అనేవారు వేదములు వ్రాశారని లేదు. సొ ఆర్య అనేది ఒక మిథ్యా వాదము అని గ్రహించాలి. మరి వేదములు ఎవరు వ్రాశారు అంటే సమాధానం చాలా సింపుల్. వేదములు భారతీయులు వ్రాశారు.
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
కొన్ని అంశములను మనము గ్రుడ్డిగా నమ్మడము చేస్తాము. ఉదాహరణకు రావణాసురుడు శివ భక్తుడు కాబట్టి అతను అసురుడు కాబట్టి అతను ద్రవిడ జాతి వాడని ఒక అపోహ వచ్చేసింది. అదే సమయంలో రాముడు శివ లింగాలని స్థాపించాడు అనే విషయం మరచిపోతాము. మరో ఆశ్చర్య జనకమైన విషయమేమిటంటే వాల్మీకి రామాయణములో రాముని, హనుమంతుని మరియు రావణాసురుని ముగ్గురిని కూడా ఆర్య అనే విశేషణముతోనే సంబోధించడము జరిగింది. మరియు రావణాసురుడు తెలుపు రాముడు నలుపు హనుమంతుడు ఎరుపు రంగు శరీర ఛాయా కలిగినవారు. సో వేదములలో ఉపయోగించిన ఆర్య పదమునకు తెలుపు రంగుకు ఏ విధమైన సంబంధము లేదు.
ఆర్యావర్తము
విష్ణు పురాణములో మొత్తం భారత దేశమును భారతవర్షము అని ఉటంకించారు.
ఉత్తరే యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం
వర్షీ తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి.
అర్ధము: మహా సముద్రమునకు ఉత్తరమువైపున హిమాలయములకు దక్షిణమున నెలకొని ఉన్న భూభాగమును భరతావర్షము అందురు. భారత సంతతి అక్కడ నివాసము ఉందురు.
మరి ఆర్యులనే వారు లేకపోతె ఆర్యావర్తము అను నానుడి ఎలా వచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి ఆర్య పదమును సదాచారమును పాటించే వారిని సూచించే విధముగా మన శాస్త్రములలో వాడారు. జాతి పరంగా కాదు. అందుచేత ఈ అంశము వివాదముగా మారుతుంది.
మన హిందూ పూజా కార్యక్రమములను నిర్వహించేటపుడు ముందుగా విఘ్నేశ్వర పూజ నిర్వహిస్తాము. ఆ సమయంలో పఠించే సంకల్ప సూత్రము ఇలా ఉంటుంది.
మమోపాత్త దురితాక్షయాద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం|
శుభే శోభనే ముహూర్టే శ్రీ మహా విష్ణో రాజ్ణయా ప్రవర్థమానశ్యాద్య బ్రాహ్మణ| ద్వేతీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన… సంవత్సరే… ఆయనే .. ఋతౌ… మాసే…పక్షే…తిథౌ…వాసరే…శుభనక్షత్రే శుభ యోగే శుభకరణే ఏవంగుణ వేశేషణ విశిశ్టాయామ్ శుభ తిథౌ – శ్రీమాన్ ….గోత్రః ….నామాధేయః ధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …. నామధేయస్య ధర్మపత్నీ సమెతస్య| మమోపాత్త….
ఈ మంత్రములో భారత దేశ భౌగోళిక ఉనికిని సూచించడానికి జంబుద్వీపే భరతవర్షే భరతఖండే… అన్నారే గాని ఆర్యావర్త అని అన లేదు.
అయితే విష్ణు పురాణములోను, మనుస్మ్రితి లోను భౌదాయన ధర్మసుత్రములలోను ఆర్యావర్తము ప్రసక్తి ఉంది. కాని ఆర్య జాతి ప్రసక్తి లేదు. అన్నీ శ్లోకములు కూడా బుద్ధిమంతులు సజ్జనులు ఆర్యావర్తము నివసిస్తారు అని మాత్రమె ఉంది.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
పైన హిమాలయముల నుంచి మొదలుకుని మహా సముద్రము వరకు విస్తరించి ఉన్న భుభాగామును భరత వర్షము అని విష్ణు పురాణములో చెప్పడము చూశాము. ఇతర గ్రంధములలో ఇదే ప్రాంతమును ఆర్యావర్తము అని చెప్పారు.
ప్రాగదర్శన ప్రత్యక్కాలవనా ద్దక్షిణేన హిమవంత ముదక్పారియాత్రమే
తదార్యావర్త తస్మిన్ య ఆచారస్య ప్రమాణమ్ (బౌధాయన ధర్మ సూత్రము 1.1.2.10)
అర్ధము: పడమర దిక్కునందు ఆదర్శన ప్రాంతము, తూర్పుదిక్కున కాలకవనము నెలకొని ఉండే ప్రాంతములో హిమాలయములనుండి ప్రవహించే నీరు పారుతుంది అదియే ఆర్యావర్తము. సదాచారములను పాటించే జనులు అక్కడ నివసించడమే దానికి ప్రమాణము.
గంగా యమునయోరంతరమిస్యేకే (బౌధాయన ధర్మ సూత్రము 1.1.2.11)
గంగా యమునా నదుల నడుమ గల భూమి అది ఇది ఒకటే. అని రెండవ శ్లోకము చెబుతున్నది. ఆ విధముగా భౌదాయన ధర్మ సూత్రము ప్రకారము ఆదర్శన ప్రాంతమునుండి మొదలుకుని ప్రయాగ వరకు గల ప్రాంతము అయి గంగా యమునా సదుల మధ్య విస్తరించి ఉండే భూమియే ఆర్యావర్తము.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
(ఆదర్శన ప్రాంతము పూర్వపు సరస్వతి నది అదృశ్యమయిన ప్రాంతమని అంటే ప్రస్తుత ఘగ్గర్ నది ఎండిపోయి ఉన్న ప్రాంతమని కొందరి చరిత్రకారుల వాదన. కాని నేను ప్రస్తుత మొహంజొదారో ప్రాంతములోనే సరస్వతి నది నిషాడులకు ఆదర్శనమయిందని, అదృశ్యము కాలేదని “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను నా పుస్తకములో వివరించాను. కాలకవనము ఎక్కడ ఉండేదో ఇంతవరకు ఆచూకి కనిపెట్టలేదు.)
ఆర్యావర్తములో సదాచారములను పాటించే జనులు నివసిస్తారు అని హిమాలయములనుండి ప్రవహించే గంగా యమునా నదుల మధ్య ప్రాంతమే ఆర్యావర్తమని బౌదాయన ధర్మ సూత్రములు చెబుతున్నవి. అక్కడ నివసించే వారు సదాచారము గలవారని చెప్పినది, అంతేగాని ఆర్యులని చెప్పలేదు. అలాగే వారి రూపురేఖలను వర్ణించ లేదు. ఆర్య జాతి వారు పొడగరులని, తెలుపు రంగు వర్ణము కలిగిన వారు అని, వారి ముక్కులు సూటిగా మొనదేలి ఉంటాయని ఆర్యజాతి వాదులు వాదిస్తారు. ఆర్యులనే వారిని గురించి అలాంటి వర్ణన మనకు హిందూ గ్రంధములలో ఎక్కడా కుడా కనబడదు.
ఇక మనుస్మ్రితి లో రెండు శ్లోకములు వరుసగా కనిపిస్తాయి. మొదటిది మధ్యదేశము గురించి చెబుతుంది, రెండవది ఆర్యావార్తము గురించి.
హిమవద్వింధ్యయోర్మధ్యం యత్ప్రాగ్విశసనాదాపి
ప్రత్యగేవా ప్రయాగాఛ్చ మధ్యదేశ: ప్రకీర్తితః
అనగా: హిమాలయములకు వింధ్యా పర్వతాలకు మధ్యలో ఉండి, విశాసన అనే ప్రాంతమునకు తూర్పుదిక్కున అలాగే ప్రయాగకు పడమర గాను నెలకొని ఉండే ప్రదేశమును మధ్య దేశమని అంటారు. అనగా బౌదాయన ధర్మ సుత్రములలో వర్ణించన ఆర్యావర్తమును మనుస్మృతి మధ్య దేశము అని చెబుతుంది. తదుపరి శ్లోకం ఇలా చెబుతుంది,
ఆసముద్రాత్తు వై పూర్వదా సముద్రాత్తు పశ్చిమాత్
తయోరేవారంతరం గిర్యోరార్యావర్తం విదుర్భుదా:
అర్ధము: తూర్పున సముద్రము పడమరలో సముద్రము ఉండి మధ్యలో ఒక పర్వత శ్రేణితో విభజించ బడి ఉండే ప్రాంతమే ఆర్యావర్తము. అక్కడ విచక్షణా జ్ణానము కలిగిన బుద్ధిమంతులు నివసిస్తారు.
ఇక్కడ హిమాలయముల ప్రసక్తి రాలేదు. కాని పశ్చిమ తూర్పు దిక్కులలో సముద్రము ఉండే ప్రాంతము అప్పుడయిన ఎప్పుడయినా వింధ్య పర్వతములకు దక్షిణములో ఉన్న దక్షిణ దేశమని మనము భావించవచ్చు. ఆ విధంగా హిమాలయములకు దిగువున సముద్రం వరకు విస్తరించి ఉన్న మొత్తం భారత దేశమును ఆర్యావర్తము అని మనుస్మృతి చెబుతుంది అని మనము అర్ధము చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బుద్ధిమంతులు నివసించే ప్రాంతమును ఆర్యావర్తము అన్నారు. అంతేగాని తెల్లని చర్మము గలవారు, పొడగరులు, ముక్కు సూదిలా మొన తెలినవారు ఉండే ప్రాంతము ఆర్యావర్తనము అని చెప్పడము లేదు.
ప్రాచీన కాలములో భారత దేశములో పర్యటించిన విదేశీయులు భారతీయులను గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం.
స్త్రాబో ఇలా అన్నాడు, “భారతీయులు చాలా నిజాయితీపరులు, వారు తమ తలుపులకు తాళాలు వేయవలసిన అవసరం లేదు. వారి ఒప్పందాలను వ్రాతపూర్వకంగా చేసుకోరు. వారు మాట మీద నిలబడతారు.” – స్ట్రాబో (63 BCE-24 ACE)
మార్కో పోలో ఇలా అన్నాడు, “మోసం మరియు హింస లేని భారతీయులు అసంఖ్యాకంగా ఉన్నారు. వారు మరణానికి, జీవితానికి కూడా భయపడరు.”
“భారతీయులు ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపారులని మరియు అత్యంత సత్యవంతులని మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే వారు దేనికీ అబద్ధం చెప్పరు.” – మార్కో పోలో (1254-1295 ACE)
అబుల్ ఫజల్ ఇలా అన్నాడు, “హిందువులు సత్యాన్ని ఆరాధిస్తారు మరియు వారి వ్యవహారాలన్నింటిలోను అపరిమితమైన విశ్వసనీయతను కలిగి ఉంటారు.” – అబుల్ ఫజల్ (1551-1602 ACE)
మాక్స్ ముల్లర్ ఇలా అన్నాడు, “సత్యం పట్ల ప్రేమే భారతదేశంతో పరిచయం ఉన్న వారందరు భారత దేశ నివాసుల జాతీయ స్వభావంలో ప్రముఖ లక్షణంగా గుర్తించారు.” – మాక్స్ ముల్లర్ (1823-1900 ACE)
పైన నేను ఉదాహరించిన విదేశీయులు ఎవరు కుడా ప్రత్యేకంగా ఆర్యావర్తములో నివసించేవారు నిజాయితీపరులు సత్యసందులు అని చెప్పలేదు. భారత దేశములోని జనుల గురించి చెప్పారు. అలాగే వారు భారతీయుల ముఖ కవళికలు గాని శరీరాకృతిని గురించిన వర్ణన గాని చెయ్యలేదు. సో భారతీయులు అందరు ఆర్యులే. అందరు సత్యసంధూలే, అందరు బుద్ధిమంతులే. సో ప్రస్తుత భారత దేశమే పూర్వపు భారతావర్షము, అదే జంబు ద్వీపము అదే ప్రాఛీన ఆర్యావర్తము అని తెలుసుకుని మనకు గల విశిష్ట సంస్కృతిక వారసత్వమునకు భారతీయులందరూ గర్వించవలసిన అవసరము ఉంది. మరియు ప్రాచీన భారతెయుల వలె భారతీయులందరూ ఐకమత్యంగా మసలుతూ సత్య వంతులుగా జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – జనార్ధన్ ప్రసాద్