అథర్వణవేదము ప్రధానముగా కర్మ వేదము. మనము మానవులుగా చెయ్యవలసిన విధులను ఇది నిర్దేశిస్తుంది. ఐహిక విషయ సాధనకు మానవుడు నిర్వర్తించవలసిన కర్తవ్యముల వివరణ అథర్వణ వేదము (Atharvana Veda) లో ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి అథర్వణ వేదము ప్రాచీనుల ఎన్సైక్లోపీడియ (విజ్ఞాన సర్వస్వము) అని అనవచ్చు. వారి జ్ఞాన సంపదనంతటిని అథర్వణ వేదములో సంక్షిప్తము చేశారు. దీనిలో మనుష్యుడు పసిపాపగా జన్మించడము, ఆచార్యులు బాలుని బ్రహ్మచారిగా ఎంపిక చెయ్యడము, వేదాభ్యాసము, వివాహము, గృహస్తాశ్రమము, వివాహితకు సూచనలు, వంశోద్ధరణ, పాడి పంటలు, నైతిక విలువలు, రాజన్ లు పరిపాలన వ్యవహారములలో తీసుకోవలసిన మెలకువలు, యుద్ధములు, బ్రహ్మను బ్రహ్మద్వేషులనుండి కాపాడడము, సమాజములో రుద్రుల పాత్ర, సరస్వతీ దేవి ఆరాధన, యజ్ఞముల నిర్వహణ, గృహ, శాల నిర్మాణములు, వాస్తుశాస్త్రము, నౌకల నిర్మాణము, ఔషధములు, వైద్యము, శస్త్ర చికిత్సలు, మణులు, తాయెత్తులు ఒకటేమిటి మానవుని మనుగడకు ఉపకరించే అన్ని అంశములు అథర్వణ వేదములో వివరముగా ఉన్నాయి.
అథర్వణ వేదము అను ఈ పేజీ నేను రచించిన “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి” అను పుస్తకములోని 2 వ అధ్యాయము లోనుండి సేకరించినది అని గ్రహించవలెను.
అలా మానవుని జీవికకు, మనుగడకు ఉపయోగపడే సర్వ అంశములు అథర్వణ వేదములో ఉంటాయి. అథర్వణ వేదములోని శ్లోకములు భౌతిక అంశముల గురించి, ఐహిక సుఖముల గురించి, మానవ మనుగడ, జీవిక గురించిన జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. అయితే అథర్వణ వేదము నాస్తికుల వేదము అని భావించకూడదు. అథర్వణ వేదము ఒక ప్రక్క మానవుడి బాధ్యతలు గుర్తుచేస్తూనే మరో ప్రక్క దైవారాధనను ప్రేరేపిస్తుంది. అథర్వణ వేదముమానవుని వ్యక్తిగత, కుటుంబ, సామాజిక బాధ్యతల నిర్వహణను ఒక యజ్ఞముగా చెబుతుంది. ఎలానంటే భగవద్గీతలోని శ్రీ కృష్ణుని వచనములలాగా, “నీవు చేసే కర్మకు నీవు కర్తవే గాని ఫలితమునకు కాదు. అలా అని నీ కర్తవ్యము నిర్వహించడము నీవు మాన రాదు.” అథర్వణ వేదములో ఋగ్వేదములోవలెనే దేవుళ్లను, దేవతలను ప్రస్తుతిసున్న శ్లోకములు కోకొల్లలు గా ఉంటాయి. ఇంద్రుడు, వరుణుడు, మిత్ర, రుద్ర, శివ, దేవి, సరస్వతి, అగ్ని, అర్యమ, విశ్వానర, మారుత, మొదలుగా గల వివిధ దైవములను అథర్వణ వేదము ప్రస్తుతిస్తుంది.
…
అథర్వణ వేదమును బ్రహ్మ వేదము అని కూడా అంటారు. బ్రహ్మను సనాతనుడు అంటారు. అలా అథర్వణ వేదము సనాతనము అవుతుంది. అయితే ప్రస్తుతము మనము చదువుతున్న వేదములు ఆయా విషయాంశములను బట్టి విభజించి సంకలనము చేసినట్టినవి. ఏ వేదమునుంచి వివిధ శ్లోకములను సంగ్రహించి మిగతా వేదములను సంకలనము చేశారు అని చూస్తే అది అథర్వణ వేదమేఅవుతుంది. అథర్వణ వేదమే మూలవేదము. అయితే మరో విషయము గమనించవలెను. ప్రాచీన కాలములో వివిధ కాలములలో వివిధ ఋషుల ఆధ్వర్యములలో వేదములలోని అంశములు, శ్లోకములు పెరుగుతూవస్తూనే ఉన్నవి. అయితే ఎప్పుడూకూడా పూర్వపు శ్లోకములను చెరిపి క్రొత్తవి చేర్చిన దఖలాలు మనకు కనబడవు. ముందువ్రాసిన శ్లోకములను అలా కొనసాగిస్తూనే క్రొత్తవి జత చేర్చియున్నారు. అందుచేత వీలయితే ఏ వేదములో ఏ శ్లోకము పురాతనమయినది అని విచారించాలి గాని ఏ వేదము పురాతనమయినది అనడం సరి కాదు.
…
అథర్వణ వేదమును ఒక విజ్ఞాన కోశము అని పైన తెలుసుకున్నాము. అథర్వణ వేదములోని వివిధ శ్లోకములను ఈ పుస్తకములో అవసరము వచ్చినచోట ఉటంకించడమయినది. అయినప్పటికి విషయావగాహనకొరకు ఈ అధ్యాయములో కొన్ని అథర్వణవేద శ్లోకములు ఉదాహరణముగా ఈ క్రింది అంశములతో పరిచయముచెయ్యడమయినది.
సోమ రసము:
అథర్వణ వేదములోని ఈ క్రింది శ్లోకము సోమరసము నింపిన కలశముల గురుంచి చెబుతుంది.
సోమేన పూర్ణం కలశం బిభర్షి త్వష్టా రూపాణాం
జనితా పశూనాం శివాస్తే సన్తు ప్రజన్వ ఇహ యా
ఇమాన్య స్మభ్యం స్వధితే యచ్ఛ యా అమూః
(శ్లోకం 2409, సూక్తం-4, కాండ 9, బ్రహ్మ ఋషి: అథర్వణ వేదం)
అథర్వణవేదమును అసురులు వ్రాశారని అందుచేతనే ఈ వేదమును యజ్ఞకాలములో పఠించరని చెబుతారు. అథర్వణ వేదము అసురులు వ్రాసినట్లయితే సోమరసము తయారు చేసే జ్ఞానము వారికి ఎట్లా ఉంటుంది? అందుచేత అసురులని, దేవతలని ప్రాచీన సమాజాన్ని విడదీసి మాట్లాడడము సరికాదు.
యజ్ఞము:
ఈ క్రింది శ్లోకములు యజ్ఞప్రక్రియలో బ్రహ్మయొక్క శివునియొక్క ప్తాధాన్యతను తెలుపుచున్నవి.
య ఈశే పశుపతిః పశూనాం చతుష్పదాముత యో ద్విపదామ్ నిష్క్రీతః
స యజ్ఞియం భాగమేతు రాయస్పోషా యజమానం సచన్తామ్
(శ్లోకం 343)
"ఈశుడే పశుపతి, చతుష్పాద మరియు ద్విపాద జంతువులన్నన్నింటిని పశుపతి చల్లగా చూస్తున్నాడు. ఆయనకు చెందాల్సిన యజ్ఞభాగము ఆయనకు చెందాలి. యజమానికి ఆ పశుపతి ధనము ధాన్యములు ప్రసాదించి పోషించుగాక!"”
బ్రహ్మాస్య శీర్షం బృహదస్య పృష్ఠం వామదేవ్యముదరమోదనస్య
ఛన్దాంసి పక్షౌ ముఖమస్య సత్యం విష్టారీ జాతస్తపసో ధి యజ్ఞః
(శ్లోకం 853, సూక్తం 34, కాండ 4)
“ “ఓదనమునకు బ్రహ్మ శీర్షము, బృహత్తు వీపు, వామదేవుడు ఉదరము. యజ్ఞమునకు ఛందస్సు ప్రక్కటెముకలు, ముఖము సత్యము, విస్తరి తపస్సు.””
సంగీతము:
అవ స్వరాతి గర్గరో గోధా పరి సనిష్వణత్
పింగారి చనిష్కదదింద్రాయ బ్రహ్మోద్యతమ్
పై శ్ల్లోకంలో గర్గర అనగా పిడేలు, గోధా అనగా వీణ మరియు పింగా అనగా తంతి అని గుర్తించవలెను.
కాలము, జ్యోతిష్యము:
సంవత్సరో రథః పరివత్సరో రథోపస్థో విరాడీషాగ్నీ
రధముఖమ్ | ఇన్ద్రః సవ్తష్టాశ్చంద్రమాః సారధిః
(శ్లోకం 2229, సూక్తం -8, కాండ 8, భృగ్వంగిరా ఋషి)
“ భావము: “సంవత్సరమనే రథమునకు సూర్యుడు ముఖము, చంద్రుడు సారధి.””
షడాహు శీతాన్ షడు మాస ఉష్ణానృతుం నో బ్రూత యతమో తిరిక్తః
సప్త సుపర్ణాః కవయో ని షేధుః సప్త చ్ఛన్దాంస్యను సప్త దీక్షాః
(శ్లోకం 2247, సూక్తం -9, కాండ 8, అథర్వా కశ్యప)
భావము: "ఆరునెలలు శీతాకలము, ఆరునెలలు ఎండాకలము, ఇలా కాకుండా వేరే కాల విభజన నియమమేది? (లేదు). ఏడు మూలికలు, ఏడుగురు కవులు (ఋషులు), ఏడు ఛందో నియమములు, ఏడు రకాలయిన దీక్షలు.."”
పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పరే అర్ధే పురీషిణమ్
అథేమే అస్య ఉపరే విచక్షణే సప్త చక్రే షడర ఆహురర్పితమ్
(శ్లోకం 2598, సూక్తం-9, కాండ 9, ,బ్రహ్మ ఋషి)
ఒకసంవత్సరమునకు అయిదు కాలములనీ, కాదు ఆరు కాలములనీ అలాగే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలని,... ఇలా జ్యోతిష శాస్త్రము వివరణ జరిగినది.
ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరి ద్యామృతస్య
ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర శతాని వింశతిశ్చ తస్థు
(శ్లోకం 2599, సూక్తం 9, కాండ 9, బ్రహ్మ ఋషి)
సంవత్సరానికి 12 నెలలని, మళ్ళీ సంవత్సరానికి 360 రాత్రులు అని, మరియు 360 పగటి వేళలని రెండూ కలిపి 720 విభాగములని వివరణ ఇచ్చారు.
ఔషధములు, ఆయుర్వేదము:
సిన్ధోర్గర్భో సి విద్యుతాం పుష్పమ్
వాతః ప్రాణః సూర్యశ్చక్షుర్దివస్పయః
(శ్లోకం 4890 & 4891 సూక్తం 44, కాండ 19)
"నీటిలోనుండి విద్యుత్తులాగా ప్రభవించే ఈ ఓషధి దృష్టిని కలుగజేయును, వాతరోగమును హరించును, ప్రాణప్రదాయిగా పనిచేయును."” (తామర పువ్వు కావచ్చు)
ఉద్యన్నాదిత్య: క్రిమీన్ హన్తు నిమ్రోచన్ హన్తు రశ్మిభి: యే అన్త: క్రిమయో గవి ( స్లోకం 330 )
"పశువులలోను, మానవశరీరములలోను నెలకొనియున్న వ్యాధి కారక క్రిములను సూర్యరశ్మి నశింపజేయును."”
దర్భ గడ్డి, (కుశ గ్రాసము):
ఛింధి దర్భ సపత్నాన్ మే ఛిన్ధి మే పృతనాయతః
ఛిన్ధి మే సర్వాన్ దుర్హార్దాన్ ఛింధిమే ద్విషతో మనే
కృన్త దర్భ సపత్నాన్… పింశ దర్భ సపత్నాన్..
“ “దర్భ గడ్డి శత్రువులను చీల్చి ఛెండాడుతుంది, వారిని పిండి పిండి చేస్తుంది. ఇది ఒక ( దివ్య శక్తులు గల ) మణిలా పనిచేస్తుంది.”
యత్ తే దర్భ జరామృత్యుః శతం వర్మసు వర్మతే
తేనేమం వర్మిణం కృత్వా సపత్నాం జహి వీర్యైః
“ “దర్భ గడ్డి మనిషిని ముసలితనమునుంచి, మృత్యువు నుంచి కాపాడుతుంది, వందకవచములకు
కవచంగా పనిచేస్తుంది, శత్రువలను మట్టుబెడుతుంది.” అనగా ఇది ఔషధముగానూ తాయెత్తులాగానూకూడా పనిచేస్తుంది అని అర్థము.
యత్ సముద్రో అభ్యక్రన్దత్ పర్జన్యో విద్యుతా సహ
తతో హిరణ్యయో బిందుస్తతో దర్భో అజాయత
"ఎక్కడ సముద్రము, మేఘములు కలుస్తాయో అక్కడ మెరుపు సంభవిస్తుంది ఆ మెరుపులో నుండి ఉద్భవించే బంగారు చుక్కల / బిందువు ద్వారా దర్భ గడ్డి పుడుతుంది."”
శతావరి:
శతమహం దుర్ణామ్నీనాం గన్ధర్వాప్సరసాం శతమ్
శతం శశ్వన్వతీనాం శతవారేణ వారయే
(శ్లోకం 4851, సూక్తం 36, కాండ 19)
“ “గంధర్వాప్సరసలకు సంక్రమించిన వందరకముల వ్యాధులను శతావరి ఔషధము తొలగించినది.”(ఇప్పటికి ఆయుర్వేదములో శతావరి స్త్రీల వ్యాధులకు దివ్యౌషధముగా వాడబడుతుంది.)…….